Tuesday, July 8, 2025

పేరడీ పాటలు

సాఫ్ట్వేర్ మేనేజర్లకు ఓ ప్రేమ లేక** - పేరడీ పాట

original songఆకులో ఆకునై

కోడులో బగ్గునై

మీటులో రోతనై

స్క్రమ్ములో స్కమ్మునై

కడుపాత రొచ్చునై

నీ టీము గుడిపిపోనా

ఎటులైన ఇచటనే ఆగిపోనా? x 2


గల గల నీ వీచు కేరీయరులో మచ్చనై

జల జల నీ పారు హైకులో బ్లాకునై

పగతోటి చిరకాలం తిరిగేటి తేలునై

నడువొంపు దించేటి పదునైన కత్తినై

నీ టీము గుడిపిపోనా

ఎటులైన ఇచటనే ఆగిపోనా?


బరువెక్కి, అల నీ తల నెక్కి మలమల్ల

చెడ గొట్టి, తలవంపు నీకంపు మెయిలునై

ఆకలా దాహమా

చింతలా వంతలా

నీ తలలో వెర్రినై

ఈ కంపెనీ తగలాడ

నీ టీము గుడిపిపోనా

ఎటులైన ఇచటనే ఆగిపోనా?

***

original-బోలో బోలో బోలో రాణి క్యా చాహియే


Waiter: బోలో బోలో బోలో బాయి క్యా చాహియే
              అరె పూరి చాహియే యా పాయా చాహియే

Customer: నీ‌ బాసా నాకు తెల్డం లేదు తెలుగు తెలిసితే సెప్పు

W: ఏ ఊరు మంది? 
C: అచ్చంపల్లి, నీ ఊరు ఏది?

W: హైదరాబాదు, ఇక చూసుకో
     అచ్చంపల్లి బుల్లోడా నీకేటి కావాలా

     కేకు కావాలా స్విస్సు జూస్ కావాలా

     స్వీటు పోటు హాటు బైట్టు పండు వెన్నెల్లో

    తాయి కావాలా స్పైసి చైనీసు తేవాలా

C:  హైదరాబాది వెయిటర్ సాబ్ నాకు బిర్యాని కావాలా

    కేకు లేవో చైనీసు లేవో నాకు తెల్దంట
    బిరియాని పట్టుకొచ్చెరో ఓ పట్టు పట్టాల

W: చల్ రే బాయి, చేరా బోణి, స్టార్ట్ చేయ్యి ఫలహారం
     సూపు తాగి, పాపడాల్నీ బెండు తీసే యవ్వారం

C:  పల్లె దాటి ఫస్ట్ టైము బైటికి ఒచ్చానురయ్యో

     బజ్జి చాట్టు పిల్లగాని లోకమే తెలవదయ్యో

W: తెచ్చిన ప్లేటు చప్పున తింటే బిల్ పట్టుకొస్తా

      టిప్పు లాగేస్తా ఎగ్జిట్ గేటు చూపిస్తా

C: గేటు చూపి నీట ముంచే మాటలు ఎందుకురో
W: అచ్చంపల్లి బుల్లోడా ఇంకేటి కావాలా

C:  హైదరాబాది వెయిటర్ సాబ నాకు ఇంకో బిర్యాని కావాలా

Police:
అరె జానీ కోయి బుక్కడ్ కో ఆతే హువా దేఖా

నహి యహా తో కోయి నహి ఆయా

W: ఓ కిలాడీ ఆపు-దాడి ప్లేటు మారిస్తే బెస్టు
      తిండిబూచి ఆపిచస్తే, పట్టు కొస్తా నీ బిల్లు

C: పెద్ద బిల్లు చూస్తే చాలు ఎందుకో సిగ్గు ఒట్టు

    అందుకే నే పారిపోయా ఆపు నీ జట్టు రట్టు

W: చూసాలే నీ కండలన్ని రౌడీ రంగయ్యో

      అరె అరె నిన్ను తలదన్నే A1 కేడి నేనయ్యో

 C: నీది నాది ఒకటే భాష చూడు బాబయ్యో

W: అచ్చంపల్లి బుల్లోడా ఇంకేమి విననయ్యో

C:  హైదరాబాది వెయిటర్ సాబ, హు హుహు హుం


                                                ***



original song తాను నేను


తాను నేను ముళ్ళు వేలు  

తాను నేను కురుపు సలుపు  

తాను నేనూ పంది చేను  

తానూ నేనూ వేరు వేరు  

కసి తానైతే మసినే నేనూ  

మరణం ప్రాణం తానూ నేను  

ఎలుక పిల్లి, పెదవి చేదు.... 

తాను నేనూ గరళం గొంతు


వీధి నేను కుక్క తాను  

దారం నేను తెంపే తాను  

గుర్రం నేను పగ్గం తాను  

కావ్యం నేను కషాయం తాను  

నేను తాను రాగం రోగం  

వేరైపోని రాహు గ్రహణం  

నేను తాను రాగం రోగం  

వేరైపోని రాహు గ్రహణం


తాను నేను ముళ్ళు వేలు  

తాను నేను కురుపు సలుపు  

తాను నేను బెత్తం గాయం  

తాను నేను గాయం గేయం


తాను నేను ముళ్ళు వేలు  

తాను నేను కురుపు సలుపు  

తాను నేనూ పంది చేను  

తానూ నేనూ వేరు వేరు  

కసి తానైతే మసినే నేనూ  

మరణం ప్రాణం తానూ నేను  

ఎలుక పిల్లి, పెదవి చేదు.... 

తాను నేనూ గరళం గొంతు  

గరళం గొంతు గరళం గొంతు  

గరళం గొంతు గరళం గొంతు


***

original song వీణ వేణువైన సరిగమ విన్నావా


కోడి వేపుడైన చిటపట విన్నావా

ముక్క ఉడికిన మధురిమ కన్నావా

తనువు తహతహలాడాల, జివ్వురేగాల

జిహ్వ ఊగాల ఉయ్యాలలీవేళలో

||కోడి వేపుడైన||


చక్కగ మగ్గిన వేళ, ఆ వాసన తగిలిన వేళ

నా నోటిలో, నీ ఊసులే పలికే రాగమాల

ఆకలి రగిలిన వేళ, ఆ ముక్కను కొరికిన వేళ

నా తనువునా, అణువణువునా జరిగే రాసలీల

||కోడి వేపుడైన||


ఎదలో కోరిక ఎదుట, ఎదుటే నిలిచెను తునక

నీ రాకతో నా నోటిలో, కురిసే రసకేళిక

కదిలే కోరిక చిలక, అది నోట్లో కొస్తే గనక

నా పొట్టలో, నీ దినుసులే నడక నవ్య కళిక

||కోడి వేపుడైన||

***

[సురా] పానం

Original : సిరివెన్నెల - విధాత తలపున ప్రభవించినది



మధించి కడలిన, ప్రభవించినది, అనాది జీవన పానం, ఓం...

ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ సారం, ఓం ...

మధిర కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం

ఎద కనుమలలో, ప్రతిధ్వనించిన మధించి మదించి కాశ్యం ...

రససస్వర సుర ఝరీ గమనమౌ, సార పాన సారమిది ||2||


నే తాగిన జీవన పానం, ఈ పానం ..

మదించినై మతి-చించితిని ఈ కవనం, మధించినై మధిపించితిని ఈ మదిరం


ప్రాగ్దిశ సమయములోన సురభర మధూప కూజల సేవ,

జాగృత విహంగ పరులే వినీల గగనపు వేదిక త్రోవ ||2||


తొలికిన ఝరఝర రసముల సుర-గతి జగతికి శ్రీకారము కాగ,

విశ్వ కావ్యమునకిది భాష్యముగా..

మదించినై మతి-చించితిని ఈ కవనం, మధించినై మధిపించితిని ఈ పానం


జ్వలించు ప్రతి నర గళమున పారిన అమృత పాన తరంగం

చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం ||2||


అనాది పానం ఆది సారమున అనంత జీవన వాహినిగ సాగిన శృష్టి విలాసమునే

మదించినై మతి-చించితిని ఈ కవనం, మధించినై మధిపించితిని ఈ పానం


***

Sunday, July 6, 2025

మానుగల్లు(aka Hyderabad) వాకువ


వికీపీడియా మేరకు, హైదరాబాద్‌ను 1591లో కులీ కుతుబ్ షాహీ నెలకొల్పాడంటారు. కానీ ఇది మొత్తము వాకువ(కథ) కాదు

తెలంగాణకి జైనమత జరిమి(చరిత్ర*) ఉంది. 1000 C.E. కి ముందే, జైన కోబైలు (క్షేత్రం*) గా పేరు పొందింది.

మచ్చుకకు, kulpakji ను చూడండి — ఇది కుతుబ్ షాహీ సావి (కాలం*) ముందే ( కాకతీయులకన్నా ముందే) ఉన్న మొనారి(ప్రముఖ*) జైన బైలు (క్షేత్రం*). అలాగే, కరీంనగర్‌లో బొమ్మలగుట్ట దగ్గర గుర్తించిన జైన పరిదెల్పాలు (శాసనాలు*) మరియు తెలుగు అల్లులు (పద్యాలు*), 945 C.E. నాటివి. ఈ అల్లులు పంప పొహి(కవి*) తమ్ముడు రాయించాడు/చెక్కించాడు (పంప పొహి కన్నడంలో మహాభారతాన్ని నుడించిన (అనువదించిన*) మొనారి పొహి) ఇతడు సబ్బినాడుకు(కరీంనగర్*) చెందిన వాడు అని, తెలుగు వాడే అని కొందరి తెలుగు జరిమికారుల(చరిత్రకారులు*) వాటు(వాదన*).


తెలంగాణం శాతవాహనుల సావి నుంచి నిలువుమయమే (జనమయమే*). చెప్పాలంటే శాతవాహనులకంటే, ఇంకా చాలా ముందు నుంచి నిలువుమయమే.  ఈ జైన కోబైలు గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాలి అంటారా ?

హైదరాబాద్ దగ్గరలోని చిలుకూరు వద్ద ఒకప్పుడు జైన మరం ఉండేది ; ఇది సుమారు 2000 ఏళ్ల నాటిది అని జరిమికారుల అంచనా. కాకపోతే దానీ కూలగొట్టి, అక్కడి రాళ్లను దగ్గరలో ఉన్న చెరువు కట్టడంలో వాడేశారు. ఆ రాళ్లలో ఒకదానిపై "janina basadi" ( may be “జనీన వసతి”) అనే పరిదెల్పం కూడా గుర్తించారు.

అదే సావి నాటి, హైదరాబాద్‌ దగ్గరలో రష్ట్రకూట ఠేవ(శైలి*)లో కట్టబడిన ఒక చిన్న కోవెల కూడా ఉంది ; ఇది సుమారు 1000 ఏళ్ల నాటిది.  

మూలం

తెలంగాణ జరమికారుడు సురవరం ప్రతాప్ రెడ్డి రాసినదాని మేరకు ; గోల్కొండ సల్తనేట్‌లో 7వ ఏలిక అయిన అబ్దుల్లా కుతుబ్ షాహి తన కోట (నేటి గోల్కొండ కోట) పునాది వెయ్యటం కోసం కొండయ్య అనే వ్యక్తి బాసట(సహాయం*) కోరాడు. కోట పునాది వెయ్యటానికి సంబంధించిన ఒప్పందం రాత రూపంలో, పర్షియన్ మరియు తెలుగు నుడిలలో రాయబడింది.

ఆ ఒప్పంద పొత్తాని సురవరం గారు వెతికి, కొండయ్య లెంబి(కుటుంబం*) వద్ద కనిపెట్టారు — దీనిపై గోల్కొండా తరాంకు(పత్రిక*)లో 1941లో ఆయన రాసిన విరివి-వ్రాలు(వ్యాసం) ను చదవవచ్చు:

* జనవరి 9, 1941 సంచిక

* ఫిబ్రవరి 3, 1941 సంచిక

* ఫిబ్రవరి 20, 1941 సంచిక


గోల్కొండ కోట కూడా ఒక చిన్నపాటి పాత కాకతీయ కట్టడము పై కట్టబడి ఉండొచ్చు అన్న జాడలు ఉన్నాయి.


ఇప్పుడు హైదరాబాద్‌కి ఉన్న ఇతర పేర్ల గురించి:

భాగ్యనగర్/బాగ్‌నగర్ పేరు మీరు వినే ఉండొచ్చు — కొందరైతే దీనిని భాగమతి పేరు మీదనని అంటారు, మరికొందరైతే బాగ్ అంటే తోట అని, హైదరాబాద్ అనగా "సిటీ ఆఫ్ గార్డెన్స్" అంటారు .


అయితే ఇంకో పాత పేరు కూడా ఉంది — మానుగల్లు.

ఈ “మానుగల్లు” అనే పేరు కుతుబ్ షాహి రాసిన ఒప్పంద పొత్తములో కూడా కనిపిస్తుంది — ఇది "మాను" (చెట్టు) + "గల్లు" (రాళ్లు) అని అర్థం.

ఈ పేరు ఎలా వచ్చింది అనే దాని మీద నా ఆలోచన:  

"ఇక్కడ ఏముంది **చెట్లు** **రాళ్లు** తప్ప" అని ఒక వాడకం ఉంది, దానిలో నుంచి **మానుగల్లు** పేరు వచ్చి ఉండొచ్చు కాబోలు


తెలంగాణలో చాలా ఊర్ల పేర్లలో "గల్లు" లేక "కొండ" ఉంటుంది:

* ఓరుగల్లు – ఏకశిలా నగరం (వరంగల్)

* మానుగల్లు / గొల్లకొండ

* పానగల్లు

* ఇనుగల్లు

* చలికల్లు 

* రావికల్లు

* నాగరికల్లు/నకిరేకల్

* నల్లగొండ

* రాచకొండ

* దేవరకొండ

* హనుమకొండ

పొట్టిక్కలు

జుట్టు గాథ

లేనివారికి వెలితి రోత

ఉన్నవారికి క్షవర మోత

ముసలివారికి తెల్ల పూత

మహా చెడ్డదమ్మ ఈ జుట్టు గాథ

**


జాబు

లేనప్పుడు ఊరించేది

ఉన్నప్పుడు విసిగించేది

వరాల జల్లు కురిపించేది

వారాంతాల్లో పీడించేది

నిద్దర లోనూ నిలదీసేది

వదిలేస్తా అని బెదిరించేది

దానమ్మ, అందుకే నేను వదిలి చచ్చేది

**


ఆంజనేయుడు

లవ కుశల చేత భరత లక్ష్మణుల పరాజయము చూచి

క్రోధించి లంఘించి కదనరంగానికి కదిలి వచ్చే మారుతి

కానీ రామ బాలుల రామనామ సంకీర్తనాస్త్రము ముందు

అనంత శిఖరాలు పెళ్ళగించు ఆంజనేయుడు అశక్తుడాయె

**


పడమటి తెలుగు

వెయ్యి ఏండ్లు తర్వాత పుట్టిన వాఁడు అట

పడమటి తెలుంగు అట

స్పఘెట్టి ఇటాలియన్ అట

మన నుడికారాన్ని పోలినదట

పిచ్చి మాటలు కట్టి పెట్టాలట

ఇక ఈ తెలుగు వాఁడు కి సెలవుట

**


జ్ఞాపకాలు                                                                                                      (అల్పాక్కర)      

జ్ఞాపకాలే మన ఆప్త మిత్రుల్

జ్ఞాపకాలే మన గాఢ శత్రుల్

జ్ఞాపక లేమియే అల్పాయువు 

జ్ఞాపక కలిమియే అమరాయువు

**